
https://branham.org/en/articles/2172020_Smiles

మనం అనుకున్నదానికంటే వారు చాలా ఎక్కువగా అర్థం చేసుకుంటారు. వారు మన ఒడిలో కూర్చున్న పసిపిల్లలైనా, పదాలను పలకడం నేర్చుకుంటున్న పిల్లలైనా, లేదా నైపుణ్యాలు కలిగిన కౌమారదశలో ఉన్నవారైనా, మన పిల్లలు చదవడానికి బైబిల్ కంటే ఉత్తమమైనది మరొకటి లేదు.
ఈ క్రింది సాక్ష్యం, సంఘము ముందు తన పఠన నైపుణ్యాలను అభ్యసిస్తున్న ఒక యువకుడి గురించినది.
క్రీస్తు వధువుతో నా కుమారుడైన గాబ్రియేల్ గురించిన ఒక చిన్న సాక్ష్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. గాబ్రియేల్ చదవడం ప్రారంభిస్తున్నాడు. అతను ఇంట్లోనే చదువుకుంటాడు, మరియు అతని తల్లి, నా భార్య, అతనికి బోధిస్తుంది. నవంబర్ 10, 2019, ఆదివారం నాడు, మేము బ్రాన్హామ్ టేబర్నాకిల్ను ప్రత్యక్ష ప్రసారం చేయడం ప్రారంభించడానికి ముందు, మేము సంఘములో ఉన్నాము. నేను ఒక డీకన్ను. వర్తమానము ప్రారంభ సమయంలో గాబ్రియేల్ అల్లరి చేయకూడదని, నేను నా బైబిల్ను అతనికి చదవడానికి ఇచ్చాను. నేను ఇలా అన్నాను, “నువ్వు ఇక్కడ చదివేదంతా ‘ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు ‘, ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు నేరుగా నీతో మాట్లాడుతున్నాడు.” ఇరవై నిమిషాలు గడిచాక, అతను ఉలిక్కిపడినట్లుగా ఉన్నట్టుండి నా వైపు వెనక్కి తిరిగి చూశాడు, అప్పుడు అతను మెల్లని స్వరంతో దేవుణ్ణి మహిమపరుస్తున్నట్లు నేను గమనించాను.
ఆరాధన ముగిశాక మేము ఇంటికి తిరిగి వస్తుండగా, అతను నాతో, “నాన్నా, బైబిల్లో నాకు చాలా సంతోషాన్నిచ్చిన ఒక విషయాన్ని నేను చదివిన సంగతి మీకు తెలుసా? అని అన్నాడు. నాకు తెలియదని చెప్పాను. అతను కొనసాగిస్తూ, “నేను సహోదరుడు జోసెఫ్ బ్రాన్హామ్ (బ్రాన్హామ్ టేబర్నాకిల్ నుండి ప్రత్యక్ష ప్రసారంలో)గృహ సంఘం గురించి చెప్పడాన్ని ఎప్పుడూ వింటూ ఉంటాను, కానీ అది నాకు ఎప్పుడూ అర్థం కాలేదు. అయితే ఈ రోజు దేవుడు బైబిల్లో ఆ విషయాన్ని నాకు చూపించాడు, ఇప్పుడు అది దేవుని నుండి వచ్చిందని నాకు తెలుసు” అన్నాడు.
నేను నా భార్య వైపు చూశాను, మేమిద్దరం కాసేపు మౌనముగా యున్నాము, బైబిల్లో ఆ విషయాన్ని ఎక్కడ చదివావని అతన్ని అడగడానికి నాకు కొంత సమయం పట్టింది? అతను బైబిల్ తీసుకుని ఫిలేమోను 1:2 వచనాన్ని తెరిచాడు: “మన సహోదరియైన అప్ఫియకును, తోడియోధుడైన అర్ఖిప్పునకును, నీ యింట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయునది.”
ఓ సహోదరులారా, తన పిల్లలు ఈ లోకసంబంధమైన వాటికి దూరంగా ఉండటాన్ని చూడగలగడమే ఒక తండ్రికి ఆనందకరము.
గేదెవొ పెరీరా సంతాన
బ్రెజిల్